Janasena: జనసేన 21కి 21 సీట్లు గెలవబోతోంది: నాగబాబు

21 MLAs from Jana Sena are entering the Legislative Assembly says Nagababu

  • 21 మంది జనసేన ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెడతారన్న నాగబాబు  
  • పవన్ కల్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ మద్దతు ఫలించాయని వ్యాఖ్య
  • జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని విశ్వాసం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేసిన మొత్తం 21 స్థానాలలోనూ జనసేన విజయం సాధించబోతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యూహం, చంద్రబాబు నాయుడు అనుభవం, బీజేపీ మద్దతు ఎన్నికల్లో ఫలించాయని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నాగబాబు మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగిందనే అంశాలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.

అన్ని సర్వేలు, రిపోర్టులు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెబుతున్నాయని నాగబాబు ప్రస్తావించారు. జనసేన పార్టీ 21 స్థానాల్లోనూ విజయం సాధించబోతోందనే సమాచారం ఉందని అన్నారు. ఎవరి నియోజకవర్గంలో వారు ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అయితే వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగారని నాగబాబు అన్నారు. పార్టీ శ్రేణులందరికీ పవన్ కల్యాణ్ వెన్నెముక అని వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల రాజకీయ అనుభవం, శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ 10 సంవత్సరాలుగా పవన్ కల్యాణ్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని నాగబాబు కొనియాడారు.

పవన్ కల్యాణ్ శ్రమ వృథా కారాదనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా పనిచేశారని నాగబాబు అన్నారు. ప్రతిచోటా జనసేన కార్యకర్తలు ముందున్నారని అన్నారు. టీడీపీ, బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో సైతం జనసేన కార్యకర్తలు, వీరమహిళలు గట్టిగా నిలబడ్డారని ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో పరిస్థితులు వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవని అన్నారు.

  • Loading...

More Telugu News