Alimony: తల్లికి భరణం ఇవ్వాలంటూ కుమార్తెను ఆదేశించిన ఇండోర్ కోర్టు
- ఆస్తులపై హక్కుతో పాటు వృద్ధుల బాధ్యత కూడా ఉందని వ్యాఖ్య
- నెలనెలా రూ.3 వేలు ఇవ్వాలంటూ తీర్పు
- చీరల దుకాణం నడుపుతూ ఆర్జిస్తున్న కూతురు
తల్లిదండ్రుల ఆస్తులపై కూతుళ్లకు హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. వృద్ధురాలైన తల్లికి భరణం చెల్లించాల్సిందేనని ఓ కూతురును ఆదేశించింది. నెలనెలా కొంత డబ్బు తల్లికి పంపించాలని పేర్కొంటూ, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
కూతురు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందంటూ మధ్యప్రదేశ్ కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకున్నది ఒక్కగానొక్క కూతురని, భర్త పోయాక కూతురుతోనే ఉంటున్నానని చెప్పింది. భర్త నుంచి తనకు అందిన సొమ్ము, ఇంటిని కూతురు తీసేసుకుందని తెలిపింది. ఆపై ఆమె ఇంట్లోనే తనకు చోటిచ్చిందని వివరించింది. అయితే, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూతురు తనను కొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టిందని చెప్పింది.
దీంతో కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొంది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఇండోర్ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్.. ఆ వృద్ధురాలికి నెలనెలా రూ. 3 వేలు పంపాలని ఆమె కూతురును ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. చీరల దుకాణం నడుపుతూ నెలకు సుమారు రూ.22 వేల వరకు సంపాదిస్తున్న కూతురు.. తన తల్లి పోషణ బాధ్యతను తప్పించుకోజాలదని పేర్కొన్నారు.