Ugram Veeram: నేడు నారసింహ జయంతి.. యాదాద్రిలో ‘ఉగ్రం.. వీరం’ గ్రంథావిష్కరణ
- ఆవిష్కరించిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆలయ ఈవో
- పురాణపండ శ్రీనివాస్ రచించిన గ్రంథం
- తొలి ప్రతి ప్రముఖ గాయకుడు రామాచారికి అందజేత
- లక్షపుష్పార్చన, సహస్ర కలశాభిషేకంలో పాల్గొన్న భక్తులకు ఉచితంగా పంపిణీ
నేడు నారసింహ జయంతిని పురస్కరించుకుని లక్ష్మీనారసింహుడు కొలువైన యాదగిరిగుట్టపై ‘ఉగ్రం వీరం‘ గ్రంథాన్ని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి (ఈవో) ఏ భాస్కరరావు ఆవిష్కరించారు. శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని రచించారు. గుట్టపై నిర్వహిస్తున్న యాదాద్రి మహాపుణ్యక్షేత్ర ఉత్సవాల ప్రత్యేక వేదికపై దీనిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో భాస్కరరావు మాట్లాడుతూ జన్మాంతర సంస్కారం, విశేష పుణ్యఫలం ఉంటేనే మహానృసింహ క్షేత్రమైన యాదాద్రిలో ఇలాంటి గ్రంథాన్ని ఆవిష్కరించే భాగ్యం కలుగుతుందని పేర్కొన్నారు. తొలి ప్రతిని ప్రముఖ గాయకుడు, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ కొమండూరి రామాచారికి అందజేశారు.
పురాణపండ మాట్లాడుతూ యాదాద్రి మట్టిని తాకినప్పుడు కలిగే అనుభూతి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. యాదాద్రి ప్రధాన అర్చకుడు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు మంగళాశాసనం చేయగా, ‘ఉగ్రం.. వీరం’ దివ్యగ్రంథాన్ని దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి దోర్బల భాస్కరశర్మ పరిచయం చేశారు. లక్ష పుష్పార్చనలో పాల్గొన్న భక్తులు, సహస్ర కలశాభిషేకంలో పాల్గొన్న దంపతులు, ప్రత్యేక దర్శనాల్లో పాల్గొన్న భక్తులు, దాతలకు ఈ గ్రంథాన్ని ఆలయ సిబ్బంది ఉచితంగా అందజేశారు.