Pinnelli Brothers: ఈవీఎం ధ్వంసంపై ఈసీ సీరియస్.. పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు
- హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ టాస్క్ ఫోర్స్ బృందం
- తెలంగాణ పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు
- సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారు స్వాధీనం
పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనకు కారణమైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. సాయంత్రంలోపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ పెట్టిన ట్వీట్‌ను ఇందులో ప్రస్తావించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన హైదరాబాద్ కు వెళ్లారనే సమాచారంతో ఏపీ టాస్క్ ఫోర్స్ బృందం ఒకటి తెలంగాణకు చేరుకుంది. హైదరాబాద్ లో స్థానిక పోలీసులతో కలిసి పలుచోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలింగ్ రోజు ఏం జరిగిందంటే..
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుండగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో ప్రవేశించాడు. ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేయగా.. ఆయన సోదరుడు, అనుచరులు పోలింగ్ సిబ్బంది, ఓటర్లపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీలో చేరిన తన బంధువు మంజులపై ఆగ్రహంతో పిన్నెల్లి సోదరులు దాడి చేశారు. పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ గా కూర్చున్న మంజులపై గొడ్డలితో దాడి చేయగా.. మంజులకు నుదుటిపై గాయమైంది. మాచర్ల, కారంపూడిలో పలు పోలింగ్ బూత్ లలోనూ విధ్వంసం సృష్టించారు. ఈ ఆగడాలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గన్మెన్లను వదిలేసి పిన్నెల్లి సోదరులు పరారయ్యారు. కారంపూడి ఘటనలో అరెస్టు తప్పదనే భయంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.