Indian Railways: రైల్లో ఫుట్ బోర్డింగ్ ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్
- ప్లాట్ ఫాం వైపు కాకుండా అవతలి పక్క నుంచి కదిలే రైలెక్కిన దంపతులు
- చేతిలో లగేజీతో మెట్లపై నిలబడే ప్రయాణం
- వీడియోను చూసి అవాక్కయిన నెటిజన్లు
- రద్దీ మార్గాల్లో కేంద్రం సరిపడా రైళ్లు వేయాలని సూచన
సిటీ బస్సుల్లో ఫుట్ బోర్డింగ్ దృశ్యం కనిపించడం సాధారణమే. కానీ మీరెప్పుడైనా రైల్లో ఫుట్ బోర్డింగ్ దృశ్యాన్ని చూశారా? అది కూడా రైలు కదులుతుండగా ప్లాట్ ఫాం వైపు కాకుండా మరోవైపు నుంచి రైలెక్కి వేలాడుతూ ప్రయాణించడం ఎప్పుడైనా గమనించారా? తాజాగా ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పండగల వేళ కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణికులు కింద కూర్చొనో లేదా బాత్రూంల వద్ద నిలబడో ప్రయాణించడం పరిపాటే. కానీ నెట్టింట వైరలైన ఓ వీడియోలో మాత్రం ఓ జంట కదులుతున్న రైలెక్కడం కనిపించింది. అప్పటికే ఆ రైలు కిక్కిరిసి ఉండటంతో వారు లగేజీ పట్టుకొనే ఫుట్ బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణించడం నెటిజన్లను అవాక్కు చేసింది. సామాన్య ప్రజల రైలు కష్టాలను కళ్లకు కట్టింది.
అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు వేయాలని ఓ యూజర్ కోరగా ప్రమాదకరంగా ప్రయాణించే వారిని అరెస్టు చేయాలని మరొకరు పోస్ట్ పెట్టారు. భద్రత, సౌకర్యంకన్నా గమ్యస్థానానికి చేరుకోవడమే ముఖ్యం అయినప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయని మరొకరు అభిప్రాయపడ్డారు. మరొక యూజర్ స్పందిస్తూ రోజూ ఇలాంటి దృశ్యం కనిపించదని పేర్కొన్నాడు. పండుగలు లేదా వలసల సమయంలో పేదలు ఇలా ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తుంటారని చెప్పాడు.