Chidambaram: వయస్సు మీదపడుతోందని మోదీకి అమిత్ షా సంకేతాలిస్తున్నారా?: చిదంబరం
- నవీన్ పట్నాయక్‌కు వయస్సు మీదపడుతోందని... ఆయన రిటైర్ కావాలని ఇటీవల అమిత్ షా సూచన
- బీజేపీ అధికారంలోకి రాకపోతే అమిత్ షానే అత్యంత సంతోషించే వ్యక్తిగా కనిపిస్తున్నారని వ్యాఖ్య
- అప్పుడు తనే సభలో ప్రతిపక్ష నేతగా కూర్చునేలా వున్నారంటూ వ్యాఖ్యలు
వయస్సు మీదపడుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకేతాలు ఇస్తున్నారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఇటీవల ఒడిశా ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ... 'నవీన్ పట్నాయక్‌కు ఇప్పుడు 77 ఏళ్లు. వయస్సు మీదపడుతుండటంతో పాటు ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన రిటైర్ అవ్వాలి' అని వ్యాఖ్యానించారు.
అమిత్ షా వ్యాఖ్యలకు చిదంబరం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వయస్సును కారణంగా చూపుతూ నవీన్ పట్నాయక్‌ను రిటైర్ కావాలని అమిత్ షా సూచిస్తున్నారని... మోదీకి కూడా పరోక్షంగా ఆయన ఈ సూచన ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే అత్యంత సంతోషించే వ్యక్తి అమిత్ షానే అవుతారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. అప్పుడు మోదీ కాకుండా తనే సభలో ప్రతిపక్ష నేతగా కూర్చునేలా వున్నారని చిదంబరం అన్నారు.