BSF Jawan papad: ఎండ వేడికి ఇసుకలో పాపడాలు కాల్చిన బీఎస్ఎఫ్ జవాన్.. వైరల్ వీడియో ఇదిగో!
- రాజస్థాన్ లోని బికనీర్ లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు
- అసలే ఎడారి.. ఎండల మంటలతో అంతా ఉక్కిరిబిక్కిరి
- అక్కడి పరిస్థితి తీవ్రతను చూపేందుకు ఎడారి ఇసుకలో పాపడాలు కాల్చిన బీఎస్ఎఫ్ జవాను
అసలే మండిపోతున్న ఎండలు.. ఇంట్లోంచి కాలు బయటపెడదామన్నా భయపడే పరిస్థితి. మనకైతే ఈ మధ్య వర్షాలు పడి కాస్త చల్లబడిందిగానీ.. ఉత్తర భారత దేశంలో మాత్రం ఉష్ణోగ్రతలు ఇంకా అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా థార్ ఎడారి ప్రాంతం ఉన్న రాజస్థాన్ లో అయితే ఎక్కడ చూసినా.. కనీసం 45 డిగ్రీలకుపైనే టెంపరేచర్లు ఉంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు కూడా దాటిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది కూడా.
వేడి తీవ్రతను చూపేందుకు..
రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బీఎస్ఎఫ్ జవాన్.. అక్కడి ఎండల వేడి తీవ్రతను చూపేందుకు ఓ ప్రయత్నం చేశాడు. మనం వేయించుకుని తినే మసాలా పాపడాలను (అప్పదాలను) .. అక్కడి ఇసుకపై పెట్టాడు. దానిపై పక్కనే ఉన్న కొంత ఇసుక వేశాడు. జస్ట్ కొన్ని సెకన్లలోనే పాపడా వేయించినట్టుగా గట్టిపడిపోయింది.
- ఎండ వేడికి ఇసుకలో వేగిన పాపడాను సదరు జవాన్ విరిచి చూపించాడు. తర్వాత మరో పాపడాను జస్ట్ అలా ఇసుకపై వేసి ఉంచాడు. అది కూడా కాసేపటికి వేగినట్టుగా కనపడడం గమనార్హం.
- ప్రముఖ వార్తల ఏజెన్సీ ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ)’ ఈ వీడియోను తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.