Cambodia jobs: ఉద్యోగాల పేరుతో మోసం.. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులు

300 Indians Trapped In Cambodia Stage Protest To Expose Job Scam By Chinese Nationals

  • మోసపోయామంటూ 300 మంది భారతీయుల నిరసన
  • సైబర్ నేరాల దిశగా ప్రోత్సహిస్తున్న చైనా కంపెనీలు
  • 60 మందిని కాపాడిన భారత రాయబార కార్యాలయం
  • ఫేక్ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్

విదేశాల్లో ఉద్యోగం, భారీ మొత్తంలో వేతనం అంటూ ప్రకటనలు గుప్పించి ఆకర్షించడం.. నమ్మిన వాళ్లను దేశంకాని దేశంలో మోసం చేయడం వంటి ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 300 మంది భారతీయులు కాంబోడియాలో ఆందోళనకు దిగడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. మోసపోయిన వారిలో 60 మందిని కాపాడింది. ఇందులో సగం మంది విశాఖపట్నం వాసులేనని సమాచారం. బాధితులు, ఎంబసీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కాంబోడియాలో డాటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఉన్నాయని, పెద్దమొత్తంలో వేతనం పొందొచ్చని ఏజెంట్లు చెప్పడంతో నమ్మి మోసపోయామన్నారు. ఏజెంట్లకు భారీ మొత్తం చెల్లించి కాంబోడియాకు వచ్చామని వివరించారు. తీరా ఇక్కడికి వచ్చాక చైనా కంపెనీల ఫేక్ కాల్ సెంటర్ లో కూర్చోబెట్టి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడాలని నిర్బంధిస్తున్నారని చెప్పారు.
 
ఇండియాతో పాటు దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ తదితర దేశాల్లో ఈ మోసపూరిత కంపెనీలకు ఏజెంట్లు ఉన్నారని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. స్థానికంగా ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను నియమించుకుని కాంబోడియా, లావోస్ దేశాలకు పంపిస్తున్నారని తెలిపింది. టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ చేసి ఎంపికైన వారికి చైనా కంపెనీలు ఆకర్షణీయమైన వేతనం ఆఫర్ చేస్తున్నాయని చెప్పింది. దీంతో పాటు హాస్టల్ లో అకామిడేషన్, తిరుగు ప్రయాణానికి టికెట్ కూడా కంపెనీ ఇస్తుందని చెప్పడంతో చాలామంది జాయిన్ అవుతున్నారని తెలిపింది. వీసా ప్రాసెస్ లో కూడా ఈ ఏజెంట్లు సాయం చేస్తున్నారని, ఫ్లైట్ ఎక్కించి కాంబోడియా పంపిస్తున్నారని వివరించింది.

ఇక్కడికి చేరుకున్న తర్వాత లోకల్ క్రిమినల్ గ్యాంగ్స్ సాయంతో భారతీయులను నిర్బంధించి సైబర్ నేరాలకు పాల్పడాలంటూ శారీరకంగా, మానసికంగా టార్చర్ చేస్తున్నారని రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ఇలా వారి చెరలో చిక్కుకున్న వారిలో దాదాపు 100 నుంచి 150 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారని వివరించారు. ఇందులో 60 మందిని స్థానిక పోలీసుల సాయంతో కాపాడామని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఆన్ లైన్ లో కనిపించే ప్రకటనలు, ఏజెంట్లు చెప్పే ఆకర్షణీయమైన మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలు తెలుసుకున్నాకే ఫ్లైట్ ఎక్కాలని సూచించారు.

  • Loading...

More Telugu News