Election Commission: పోలింగ్ కేంద్రాలవారీగా పోలింగ్ శాతం వెల్లడి ఇబ్బందే: సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం
- పోలింగ్ శాతం వివరాలు 48 గంటల్లోగా వెల్లడించాలని ఏడీఆర్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్
- ఆ విధంగా చేస్తే వాటిని దుర్వినియోగపరిచే అవకాశముందని ఈసీ వివరణ
- దీనివల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో లేనిపోని అపనమ్మకం ఏర్పడే అవకాశముందని వెల్లడి
పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఎన్నికల వెబ్ సైట్ లో వెల్లడి చేయడం ఇబ్బందికరమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలా చేస్తే ఎన్నికల యంత్రాంగం గందరగోళంలో పడుతుందని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలను ఈసీ సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు సమాధానమిస్తూ ....ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ శాతం సమాచారాన్ని వెల్లడిస్తే అది గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని వివరించింది. ప్రతి విడతలోనూ పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ శాతం వివరాలను ఈసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో పడిన ఓట్ల సంఖ్యను తెలిపే ఫామ్ 17 సీ పత్రాన్ని బహిర్గతం చేయాలనే నిబంధన ఎక్కడా లేదని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఫామ్ 17 సీ ను స్ట్రాంగ్ రూమ్ లోనే భద్రపరుస్తున్నామని, కేవలం పోలింగ్ ఏజెంట్ కు మాత్రమే ఆ కాపీని పొందేందుకు అనుమతి ఉందని వివరించింది. పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ శాతం వివరాలు వెల్లడిస్తే ఆ సమాచారాన్ని ఇతర వ్యక్తులు మార్ఫింగ్ చేసి, దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో లేనిపోని అపనమ్మకం ఏర్పడే అవకాశముందని తెలిపింది.