Pulivarthi Nani: వీల్ చెయిర్ లో సిట్ ఆఫీసర్ ఎదుట హాజరైన పులివర్తి నాని.... వీడియో ఇదిగో!
- ఏపీలో మే 13న పోలింగ్
- మే 14న తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
- తీవ్రంగా గాయపడి ఇటీవల డిశ్చార్జి అయిన టీడీపీ నేత
- ఇవాళ తిరుపతిలో విచారణ చేపట్టిన డీఎస్పీ రవి మనోహరాచారి
ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగ్గా, ఆ తర్వాత రోజు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పల్నాడులో, అనంతపురం జిల్లాలోనూ పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది.
సిట్ సభ్యుల్లో ఒకరైన డీఎస్పీ రవి మనోహరాచారి ఇవాళ తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చెయిర్లో హాజరయ్యారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఆయనకు బలమైన దెబ్బలు తగిలాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పులివర్తి నాని... ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు.
ఇవాళ సిట్ ఎదుటకు వీల్ చెయిర్లో వచ్చిన ఆయన మే 14న ఏం జరిగిందో వివరించారు. ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు. కుట్రతోనే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, న్యాయం చేయాలని కోరామని పులివర్తి నాని వెల్లడించారు.