Allu Aravind: ఆ ధైర్యం దిల్ రాజుకే ఉంది: అల్లు అరవింద్

Allu Aravind praises Dil Raju in Love Me pre release event
  • ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా 'లవ్ మీ'
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న అరుణ్ భీమవరపు
  • అనుభవంలేని వాళ్లకు దర్శకులుగా చాన్స్ ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమన్న అరవింద్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో ఆశిష్. మొదటి చిత్రం రౌడీ బాయ్స్. ఇటీవల పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఆశిష్... ఇప్పుడు తన రెండో చిత్రం 'లవ్ మీ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో వైష్ణవి చైతన్య కథానాయిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. 

లవ్ మీ చిత్రం ఎల్లుండి (మే 25) రిలీజ్ కానుండగా, హైదరాబాదులో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఏమాత్రం అనుభవం లేని వారికి కూడా దర్శకులుగా అవకాశాలు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమని కొనియాడారు. అలాంటి ధైర్యం తాము చేయలేమని చెప్పారు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసే మనసున్న వ్యక్తి దిల్ రాజు అని కీర్తించారు. 

దిల్ రాజు మాట్లాడుతూ, తమ కుటుంబం నుంచి వచ్చిన హర్షిత్ రెడ్డి, హన్షిత ఇద్దరూ కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రాలు నిర్మిస్తున్నారని వివరించారు. హర్షిత్ రెడ్డికి సినిమా అంటే ఇష్టమని, హన్షిత చిన్నప్పటి నుంచి షూటింగ్ లకు వెళ్లినా, ఆమె సినీ రంగంలోకే వస్తుందని మాత్రం తాను అనుకోలేదని చెప్పారు. 

హర్షిత్, హన్షిత... తమ తొలి ప్రాజెక్టుగా బలగం సినిమాతో వేణును దర్శకుడిగా పరిచయం చేశారని, ఇప్పుడు లవ్ మీ చిత్రంతో అరుణ్ కు అవకాశం ఇచ్చారని దిల్ రాజు వివరించారు. కొత్తవాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నదే తమ బ్యానర్ స్థాపన వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.
Allu Aravind
Dil Raju
Love Me
Pre Release Event
Tollywood

More Telugu News