Australia: ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ బీజేపీ నేత కుమారుడు అనుమానాస్పద మృతి
- ఉద్యోగరీత్యా భార్యతో కలిసి సిడ్నీలో ఉంటున్న అరవింద్
- కారు వాష్ చేయించుకొని వస్తానని వెళ్లి... తిరిగిరాని అరవింద్
- సముద్రంలో అరవింద్ మృతదేహం లభ్యం
- అరవింద్‌ది హత్యనా? ఆత్మహత్యనా? అన్న కోణంలో పోలీసుల దర్యాఫ్తు
ఆస్ట్రేలియాలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ ఉద్యోగరీత్యా భార్యతో కలిసి సిడ్నీలో స్థిరపడ్డాడు. అరవింద్ ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు సిడ్నీలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని శవమై సముద్రతీరంలో లభ్యమైంది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ శవం అరవింద్‌దే అని తేలింది. సముద్రతీరంలో పోలీసులు అతని కారును కూడా గుర్తించారు. అరవింద్‌ది హత్యనా? ఆత్మహత్యనా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
అరవింద్... షాద్ నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ తనయుడు. 12 ఏళ్లుగా ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. 18 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆస్ట్రేలియా వాతావరణం పడకపోవడంతో ఆరు రోజుల క్రితమే తల్లి షాద్ నగర్ తిరిగి వచ్చింది. కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు అరవింద్ కూడా సోమవారానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. అరవింద్ భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకొని వస్తానని చెప్పిన అరవింద్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో పోలీసులు సముద్రంలో అరవింద్ మృతదేహాన్ని గుర్తించారు.