Varla Ramaiah: పిన్నెల్లి పగులగొట్టిన ఈవీఎంలో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన వర్ల రామయ్య

Varla Ramaiah reveals how many votes cast in EVM damaged by Pinnelli

  • పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి 
  • వీవీప్యాట్ల ఆధారంగా... టీడీపీకి 22, వైసీపీకి 6 ఓట్లు వచ్చాయన్న వర్ల
  • ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని వెల్లడి
  • ప్రజల్లో మార్పును భరించలేక పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశాడని విమర్శలు

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఓ ఈవీఎంను ధ్వంసం చేయడం తెలిసిందే. పిన్నెల్లి ఈ కేసులో  ఏ1 నిందితుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పిన్నెల్లి చేతిలో ధ్వంసమైన ఆ ఈవీఎంలో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో వర్ల రామయ్య వెల్లడించారు. ఆ ఈవీఎంతో అనుసంధానమైన వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను బట్టి... టీడీపీకి 22 ఓట్లు, వైసీపీకి 6 ఓట్లు పడ్డాయని వివరించారు. 

మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని పిన్నెల్లికి అర్థమైందని, ప్రజల్లో మార్పును భరించలేక పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశాడని వర్ల రామయ్య విమర్శించారు. కానీ పిన్నెల్లి అరాచకాలను ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచివేశారని తెలిపారు. 

మాచర్ల సున్నితమైన ప్రాంతం అని, ఈ నియోజకవర్గంలో కేంద్ర బలగాలతో భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, పోలింగ్ రోజున విధుల్లో ఏపీ పోలీసులు మాత్రమే కనిపించారని పేర్కొన్నారు. మాచర్ల సమస్యాత్మక ప్రాంతం అని తెలిసి కూడా ఇక్కడ కేంద్ర బలగాలను దింపలేదని, ఇది పోలీసుల తప్పిదమా, లేక ఎన్నికల సంఘం తప్పిదమా? అనేది తేలాల్సి ఉందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. 

మాచర్ల నియోజకవర్గంలో మే 13న కేంద్ర బలగాలు విధుల్లో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈవీఎంను పగులగొట్టిన పిన్నెల్లిని కాల్చిపడేయడమో, లేక రెక్కలు విరిచి కట్టేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడమో జరిగేదని అన్నారు.

  • Loading...

More Telugu News