Botsa Satyanarayana: విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం: మంత్రి బొత్స
- 175 సీట్లు గెలుస్తామన్న వైసీపీ సీనియర్ నేత
- మరోసారి విజయనగరంలో తొమ్మిది సీట్లు గెలుస్తామంటూ విశ్వాసం
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదన్న బొత్స
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని, జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని, ఎన్నికలు అయిన దగ్గరి నుంచి కనిపించటం లేదని బొత్స అన్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఎక్కడికి వెళ్లింది ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఏయే ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆయన అన్నారు.
టెక్కలిలో వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేసిందని ఆరోపిస్తున్నారని, మరి మిగతా చోట్ల ఎవరు చేశారని బొత్స ప్రశ్నించారు. ఇక పోలింగ్‌కు ముందు వృద్ధులకు పింఛన్లు ఇవ్వొద్దంటూ చంద్రబాబు లేఖ రాశారని, వృద్ధుల ప్రాణాలను టీడీపీ పొట్టనపెట్టుకుందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ధనవంతులు, బలవంతులు, డబ్బున్నవారే చంద్రబాబుకు కావాలని విమర్శించారు.