Hyderabad: దేశవ్యాప్తంగా ఐటీ నియామకాల్లో మందగమనం... హైదరాబాద్, బెంగళూరు అదుర్స్
- 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు నివేదికను విడుదల చేసిన ఇండీడ్
- హైదరాబాద్లో 41.5 శాతం పెరిగిన ఉద్యోగ నియామకాలు
- బెంగళూరులో 24 శాతం పెరుగుదల
- దేశవ్యాప్తంగా 3.6 శాతం మేర తగ్గుదల
దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగావకాశాలు క్షీణించినప్పటికీ.. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మాత్రం పెరిగాయని జాబ్ పోర్టల్ ఇండీడ్ నివేదిక తెలిపింది. ఈ మేరకు ఇండీడ్ 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ ఉద్యోగ నియామకాలు, జాబ్ క్లిక్స్పై అధ్యయనం చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం విడుదల చేసింది.
ఇండీడ్ డేటా ప్రకారం, హైదరాబాద్లో ఉద్యోగ నియామకాలు 41.5 శాతం, బెంగళూరులో 24 శాతం పెరిగాయి. హైదరాబాద్ ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొంది. ఇక్కడి మౌలిక సదుపాయాలు, వాతావరణం అనుకూలంగా మారినట్లు తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఐటీ ఉద్యోగులకు ప్రధాన ఉద్యోగ విపణి కేంద్రాలుగా ఉన్నట్లు వెల్లడించింది.
ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం ఎక్కువ మంది యువత హైదరాబాద్కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు రియాల్టీ, మౌలిక వసతులు, ట్రాఫిక్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్కు ప్రాధాన్యమిస్తున్న వారి సంఖ్య 161 శాతం పెరిగినట్లు జాబ్ క్లిక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఇండీడ్ నివేదిక తెలిపింది. బెంగళూరులో ఇది 80 శాతంగా ఉంది. ఐటీ నియామకాలు, ఉద్యోగుల ప్రాధాన్యతలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు మాత్రమే సానుకూలంగా ఉన్నాయి. ఇందులోనూ బెంగళూరు కంటే హైదరాబాద్ ముందుంది.
ఇక, దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగ అవకాశాలు 3.6 శాతం మేర తగ్గాయి. అంతర్జాతీయస్థాయిలో అస్థిరత నెలకొనడంతో ఐటీ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాల్లో మందగమనం కనిపిస్తోందని తెలిపింది. ఐటీ ఉద్యోగ ఆశావహులు నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా పెరుగుతున్న పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని పేర్కొంది.