Clothes: బట్టలు మడత పెట్టేందుకూ ఓ మెషీన్!
- ముడతలు లేకుండా నీట్ గా బట్టలు మడతపెడుతున్న యంత్ర పరికరం
- నెట్టింట వైరల్ గా మారిన వీడియో
- దానికి 87 లక్షల వ్యూస్, 22 వేలకుపైగా లైక్ లు
పప్పు రుబ్బేందుకు మిక్సీ, గ్రైండర్.. అంట్లు తోమేందుకు డిష్ వాషర్.. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్.. అన్నానికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్.. చపాతీలు ఒత్తేందుకు రోటీ మేకర్. ఇంటి పనులను చకచకా చేసేందుకు మనకు ఉపయోగపడుతున్న యంత్ర పరికరాలు ఇవి. తాజాగా ఈ జాబితాలో మరొకటి చేరింది. అదే బట్టలు మడతపెట్టే మెషీన్!
ఉతికిన బట్టలను నీట్ గా మడత పెట్టడం ఇంట్లో వారికి పెద్ద టాస్కే. ఎవరిని సాయం చేయమన్నా అమ్మో మావల్ల కాదని అంటుంటారు. అందుకే ఈ విషయంలో ఇల్లాలికి సాయం చేసేందుకు టెక్నాలజీ ముందుకొచ్చింది. ముడతల్లేకుండా, మడత నలగకుండా ఈజీగా బట్టలు మడత పెట్టేందుకు ఓ మెషీన్ అందుబాటులోకి వచ్చేసింది! మార్కెట్లో ఇటీవల విడుదలైన బట్టలు మడతబెట్టే మెషీన్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ‘ఫోల్డింగ్ మెషీన్స్ ఉన్నాయి’ అంటూ ఓ పోస్ట్ తో కూడిన వీడియో ‘ఎక్స్’యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వెంటనే వైరల్ గా మారింది. ఈ వీడియోకు 87 లక్షల వ్యూస్, 22 వేలకుపైగా లైక్ లు లభించాయి.
ఆ వీడియోలో ఓ మహిళ టీ షర్ట్ లతోపాటు చొక్కాలను మెషీన్ హ్యాండిల్ వద్ద ఉంచగా మెషీన్ వాటిని లోపలకు లాక్కుంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే వాటిని అందంగా మడతపెట్టి తిరిగి బయటకు పంపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా మెషీన్ ను చూసి ముచ్చటపడుతున్నారు. అయితే కొందరు యూజర్లు మాత్రం దీన్ని చూసి పెదవి విరిచారు. వీడియోలోని మహిళ చేత్తో బట్టలు మడత పెట్టి ఉంటే మరింత వేగంగా ఆ పని పూర్తయ్యేదని కామెంట్ చేశారు.