Narasaraopet: నరసరావుపేట లోక్ సభ స్థానంలో పోలింగ్ వెల్లువెత్తింది: గణాంకాలు వెల్లడించిన ఏపీ సీఈవో
- ఏపీలో మే 13న పోలింగ్
- నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందన్న సీఈఓ
- 85.65 శాతం ఓటింగ్ నమోదైనట్టు వెల్లడి
- 14,85,909 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరణ
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నేడు సోషల్ మీడియాలో ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ స్థానంలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందని, భారీగా పోలింగ్ శాతం నమోదైందని వెల్లడించింది.
మే 13న జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో 85.65 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో కార్యాలయం తెలిపింది. 1967 నుంచి ఇప్పటివరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా, ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని పేర్కొంది.
నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొత్తం ఓటర్ల సంఖ్య 17,34,858 అని వెల్లడించింది. అందులో 14,85,909 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని స్పష్టం చేసింది.
పురుషులు 85.94 శాతం, మహిళలు 85.37 శాతం, ట్రాన్స్ జెండర్లు 46.07 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని సీఈవో కార్యాలయం వివరించింది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే... చిలకలూరిపేట-85 శాతం, గురజాల-84.30, మాచర్ల-83.75, నరసరావుపేట-81.06, పెదకూరపాడు-89.18, సత్తెనపల్లి-86.97, వినుకొండ-89.22 శాతం పోలింగ్ నమోదైందని ఏపీ సీఈవో కార్యాలయం వెల్లడించింది.