General Elections-2024: ఆరో విడత పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే!
- దేశంలో ఈసారి ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు
- ఇప్పటివరకు ఐదు దశల పోలింగ్ పూర్తి
- నేడు ఆరో దశ ఎన్నికలు
- 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 ఎంపీ స్థానాలకు పోలింగ్
నేడు దేశంలో ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ దంపతులు ఢిల్లీలో ఓటు వేశారు.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె కుమారుడు కూడా ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలో ఓటు వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆరో విడత పోలింగ్ వేళ ఢిల్లీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్ లో ఓటు వేశారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఝార్ఖండ్ లోని రాంచీలో ఓటు వేశారు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి రాంచీలో ఓటు వేశారు.
భారత మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ఢిల్లీలో ఓటు వేశారు. సిట్టింగ్ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా ఇవాళ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.