IPL Bettings: ఐపీఎల్ ఫైనల్స్.. హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగులు!
- హైదరాబాద్‌కు మకాం మార్చిన దేశంలోని ప్రధాన బుకీలు
- ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో ఉంటూ వాట్సాప్ గ్రూపుల్లో భారీగా బెట్టింగులు
- ఆన్ లైన్ లావాదేవీలతో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న లావాదేవీలు
- నగరంలో దాదాపు రూ.500 కోట్ల వరకూ బెట్టింగ్ సొమ్ము చేతులు మారొచ్చని అంచనా
ఐపీఎల్ ఫైనల్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగ్ ముఠాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం కావాల్సిన వారికి పంపించాయి. దేశంలోని ప్రధాన బుకీలు నగరంలోనే మకాం వేసినట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్, బేగం బజార్, ఘాన్సీబజార్, అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఖరీదైన హోటల్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్స్, ఫామ్‌హౌసుల్లోని గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాట్సాప్ ద్వారా రూ. 1000 నుంచి రూ. 10 లక్షల వరకూ పందేలు ఆహ్వానిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుకీలు ఇళ్ల బయట సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు, బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
నగరంలో ఐపీఎల్ సీజన్ లో రూ. 500 కోట్ల మేర పందెం సొమ్ములు చేతులు మారుతున్నా కేవలం 5-10 శాతం మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా పందేలు జరుగుతుండటంతో నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. స్మార్ట్ ఫోన్, లోన్ యాప్ లతో అప్పులు, రెట్టింపు లాభాలంటూ యువకులకు వల వేస్తున్నారు. నగరంలో ఎందరో యువకులు, ఉద్యోగులు పందేలకు బానిసలుగా మారారు. కొందరు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు.