Moye moye moment: చేతిపై కమలం టాటూ.. ఓటు ఎవరికంటే ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ అభిమాని.. వీడియో ఇదిగో!
- బీజేపీకి ‘మోయె మోయె మూమెంట్’ అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
- జూన్ 4న ప్రధాని మోదీ, అధికార బీజేపీల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని వ్యాఖ్య
- ఇండియా కూటమిదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ
ముచ్చటగా మూడోసారి అధికారం తమదేనంటూ బీజేపీ చేస్తున్న ప్రకటనలన్నీ నీటిమూటలేనని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. ఆ పార్టీకి వాళ్ల అభిమానులే ఓటేయడంలేదని చెప్పింది. ఈమేరకు బీజేపీ అభిమాని ఒకరు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. బీజేపీకి, మోదీకి ఇది మోయె మోయె మూమెంట్ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.
శనివారం దేశవ్యాప్తంగా ఆరో దశ పోలింగ్ జరుగుతుండగా మీడియా పలువురు ఓటర్లతో మాట్లాడుతూ లైవ్ చూపెడుతోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పోలింగ్ కేంద్రం వైపు వెళుతుండగా ఆపి, ఆయన చేతిపై ఉన్న కమలం గుర్తును మీడియా ప్రతినిధి చూపించాడు. నిజమైన అభిమానం ఇలా ఉంటుందని చెబుతూ.. ఆ అభిమానికి పలు ప్రశ్నలు సంధించాడు.
సంభాషణ పూర్తయ్యే దశలో ఎవరికి ఓటేయబోతున్నారంటూ అడగగా.. కాంగ్రెస్ కే నా ఓటు అంటూ సదరు అభిమాని ట్విస్ట్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేస్తూ.. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూడా ఇలాంటి ట్విస్టే చోటుచేసుకుంటుందని, బీజేపీకి షాక్ తప్పదని క్యాప్షన్ జోడించింది. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసింది.