Sunrisers Hyderabad: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ‘రిజర్వ్ డే’ కూడా రద్దయితే? విజేత ఎవరంటే?
- వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డేగా ఉన్న సోమవారానికి వాయిదా
- సోమవారం కూడా అంతరాయం ఏర్పడితే కీలకమవనున్న పాయింట్ల పట్టికః
- అగ్రస్థానంలో ఉండడంతో టైటిల్‌ను ఎగరేసుకుపోనున్న కోల్‌కతా నైట్ రైడర్స్
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే మరికొన్ని గంటల్లోనే ఆరంభం కానున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చునని వాతావరణ శాఖ రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. చెపాక్ స్టేడియంలో పగటిపూట వర్షం పడే అవకాశం దాదాపు 47 శాతంగా ఉందని, అయితే సాయంత్రానికి ఈ అవకాశం 32 శాతానికి తగ్గుతుందని వెదర్.కామ్ రిపోర్ట్ అప్రమత్తం చేసింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ కూడా తగు చర్యలు తీసుకుంది.
రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దయితే?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వర్షం కారణంగా ఇప్పటికే పలు మ్యాచ్‌లు రద్దయ్యాయి. లీగ్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు కాబట్టి మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. అయితే ఫైనల్ సహా ఇతర ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డేగా ఉన్న సోమవారానికి మ్యాచ్ వాయిదా పడుతుంది. రిజర్వ్ డే నాడు 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఒక వేళ వర్షం ఆటంకం కలిగిస్తే 5-5 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే డక్‌వర్త్-లూయిస్ విధానాన్ని కూడా ఉపయోగిస్తారు.
అయితే వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో జట్ల ర్యాంకింగ్స్ కీలకమవుతాయి. ఈ సమీకరణంలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ట్రోఫీని ఎగరేసుకుపోతుంది. లీగ్ దశలో నంబర్-2లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.