Jaya Badiga: అమెరికాలో జడ్జిగా మాతృభాషలో పదవీప్రమాణం చేసిన తెలుగు మహిళ... వీడియో పంచుకున్న చిరంజీవి

Jaya Badiga take oath as California judge in her mother tongue Telugu

  • కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయ బాడిగ
  • తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన వైనం
  • జయ బాడిగ విజయవాడ మూలాలున్న తెలుగు మహిళ 

అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులను చేపడుతుండడం తెలిసిందే. విజయవాడ మూలాలు ఉన్న జయ బాడిగ అనే మహిళ కూడా ఇటీవల కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితురాలయ్యారు. జయ బాడిగ  కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా నిలిచారు. 

తాజాగా, ఆమె పదవీప్రమాణం స్వీకారాన్ని తన మాతృభాష తెలుగులో చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ పదవీప్రమాణం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జయ బాడిగ పదవీప్రమాణం వీడియోను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా న్యాయమూర్తిగా నియమితురాలైన జయ బాడిగ గారికి హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా, తెలుగు సంస్కృతిని, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్లయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారందరూ ఎంతో గర్వపడేలా చేసింది. 

భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెందరో తన బాటలో నడిచేలా స్ఫూర్తినిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఆమె మా కుటుంబ మిత్రుడు బాడిగ రామకృష్ణ గారి కుమార్తె కావడం వ్యక్తిగతంగానూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

బాడిగ రామకృష్ణ మచిలీపట్నం మాజీ ఎంపీ. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా వ్యవహరించారు. జయ బాడిగ హైదరాబాదులో విద్యాభ్యాసం చేసి అమెరికాలో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు.

  • Loading...

More Telugu News