Uttam Kumar Reddy: ఆ విమర్శల్లో నయాపైసా నిజం లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy fires on opposition
  • విపక్షాల విమర్శలకు ఉత్తమ్ కుమార్ కౌంటర్
  • మహేశ్వర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టాలని హితవు
  • ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీదేనని విమర్శలు
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విపక్షాలపై ధ్వజమెత్తారు. హైదరాబాదు గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు చేస్తున్న విమర్శల్లో నయాపైసా నిజం లేదని అన్నారు. 

అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అవే నిజమని నమ్మించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, బాధ్యత లేకుండా ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పౌరసరఫరాల విభాగం రూ.58 వేల కోట్లు అప్పులు చేసిందని, అందులో రూ.11 వేల కోట్ల మేర నష్టాలేనని తెలిపారు. 

ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ గత పాలకులు రూ.20 కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్దే  వదిలేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాము ఈసారి ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని, రైతులకు చెల్లింపులు కూడా వెంటనే జరిగేలా చర్యలు  తీసుకుంటున్నామని వెల్లడించారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరిగింది రూ.200 కోట్లేనని, అలాంటిది రూ.2,000 కోట్ల అవినీతి జరిగిందని ఎలా అంటారని ఉత్తమ్ మండిపడ్డారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని... నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే  ఊరుకునేది లేదు అని ఆగ్రహం వెలిబుచ్చారు. 

రాష్ట్రంలో తాను యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నానంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అంటున్నారని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. వినతిపత్రాలు ఇవ్వాలంటూ సీఎం అపాయింట్ మెంట్ తీసుకుని, తీరా సీఎం చాంబర్లోకి వెళ్లాక ల్యాండ్ సెటిల్మెంట్ గురించి మాట్లాడింది ఎవరని ఎద్దేవా చేశారు. 

తాను వెయ్యి కోట్లు తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారని, బీజేపీ శాసనసభాపక్ష పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపారేమో అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీకి డబ్బులు పంపే సంస్కృతి బీజేపీకే ఉందని, ఇకనైనా మహేశ్వర్ రెడ్డి నీచపు మాటలు మానుకోవాలని హితవు పలికారు.
Uttam Kumar Reddy
Congress
BJP
BRS
Telangana

More Telugu News