GV Anjaneyulu: కౌంటింగ్ రోజు ఇలాంటి వ్యక్తి చేతిలో అధికార యంత్రాంగం ఉండడం చాలా ప్రమాదకరం: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు
- ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై విపక్షాల ధ్వజం
- విశాఖలో భారీ స్థాయిలో భూ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు
- జవహర్ రెడ్డిని ఈసీ ఎందుకు ఉపేక్షిస్తోందన్న జీవీ ఆంజనేయులు
- ఏం చేసినా చెల్లుతుందనే స్థితికి సీఎస్ చేరారని విమర్శలు
- సీఎస్ పై భూకుంభకోణం ఆరోపణల పట్ల ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై విపక్షాలు తీవ్రస్థాయిలో భూ అక్రమాల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జవహర్ రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకు ప్రత్యేకంగా చూస్తోంది? వివాదాల్లో ఉంటున్న వ్యక్తిని సీఎస్ గా ఎందుకు కొనసాగిస్తోంది? అని ప్రశ్నించారు. పెన్షన్ మరణాల సమయంలోనే సీఎస్ ను తొలగించాల్సిందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే పరిస్థితికి చేరిన సీఎస్ పై ఎందుకు ఉపేక్షిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
నెలరోజుల్లో రిటైర్ కానుండడంతో, ప్రభుత్వ ప్రాపకం కోసమే సీఎస్ ప్రయత్నిస్తున్నారని జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీఎస్ జవహర్ రెడ్డి అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ముఖ్యమంత్రి కోసం దేనికైనా సిద్ధమనే రీతిలో సీఎస్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
సీఎస్ పై భూకుంభకోణం ఆరోపణలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజు ఇలాంటి వ్యక్తి చేతుల్లో అధికార యంత్రాంగం ఉండడం చాలా ప్రమాదకరం అని జీవీ ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణల నుంచి రక్షణ కోసం కౌంటింగ్ రోజున అధికార పార్టీకి కొమ్ముకాసే ముప్పు ఉందని హెచ్చరించారు.