Kavya Maran: డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి సన్ రైజర్స్ ఆటగాళ్లను ఓదార్చిన కావ్యా మారన్... వీడియో ఇదిగో!
- ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్
- నిన్న జరిగిన ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి
- కన్నీటి పర్యంతమైన కావ్యా మారన్
- నిరాశలో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లకు ఉత్సాహం కలిగించిన యజమాని
ఐపీఎల్ 17వ సీజన్ లో తమ విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలతో సరికొత్త టీ20 క్రికెట్ ను ఆవిష్కరించిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. తొలి పవర్ ప్లేలోనే వంద పరుగులు అవలీలగా చేసి రికార్డుల మోత మోగించిన సన్ రైజర్స్... ఫైనల్ లో నిరాశాజనకమైన ఆటతీరు కనబర్చింది. నిన్న రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయింది. తద్వారా రన్నరప్ గా సరిపెట్టుకుంది.
సన్ రైజర్స్ యజమాని కావ్యా మారన్ అయితే దీన్ని పరాజయం కంటే పరాభవంగానే భావించారు. మ్యాచ్ పూర్తి కాగానే కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, అంత బాధలోనూ ఆమె తమ ఆటగాళ్లను ఓదార్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన కావ్యా మారన్... నిరుత్సాహంతో ఉన్న తమ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.
"మీరు నిజంగా మమ్మల్ని ఎంతో గర్వించేలా చేశారు. టీ20 క్రికెట్ ఆడే విధానాన్ని మీరు పునర్ నిర్వచించారు. ఐపీఎల్ లో ప్రతి ఒక్కరూ సన్ రైజర్స్ గురించి మాట్లాడుకునేలా చేశారు. కానీ ఇవాళ రోజు మనది కాదు... అంతే! కానీ టోర్నీలో మీరు ఎంతో చక్కగా ఆడారు... బ్యాట్ తోనూ, బంతితోనూ మీ ప్రదర్శనలు అమోఘం. మీ అందరికీ కృతజ్ఞతలు.
గత సీజన్ లో చివరి స్థానంలో నిలిచినప్పటికీ, ఈ సీజన్ లో మన అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానాలకు వచ్చారంటే... అది మీ వల్లే. ఇవాళ కేకేఆర్ ఐపీఎల్ చాంపియన్ గా నిలిచినప్పటికీ, ప్రతి ఒక్కరూ సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు... ఇక ముందు కూడా సన్ రైజర్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ టోర్నీలో మనం ఆడిన ఆట అలాంటిది.
ఎవరూ నిరుత్సాహపడవద్దు... మనం ఫైనల్స్ వరకు వచ్చాం... ఇది కూడా ఇతర మ్యాచ్ ల వంటిదే. ఇవాళ ఇతర టీములు కూడా మన ఆటను చూస్తూ ఉండి ఉంటాయి. అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు... త్వరలోనే మళ్లీ కలుసుకుందాం" అంటూ కావ్యా మారన్ తన సందేశం వినిపించారు.