Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు క్యాన్సర్ లక్షణాలు?: ఢిల్లీ మంత్రి అతిశీ కీలక వ్యాఖ్యలు
- కేజ్రీవాల్లో కనిపిస్తోన్న లక్షణాలు తీవ్ర కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్‌ను సూచిస్తున్నాయన్న అతిశీ
- వైద్య పరీక్షల్లో కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలినట్లు వెల్లడి
- వైద్యుల పరిశీలనలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ బరువు పెరగడం లేదన్న మంత్రి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గడంతో పాటు ఆయనకు కీటోన్ స్థాయులు పెరిగాయని... ఇది ఆందోళనకు గురిచేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ అన్నారు. కేజ్రీవాల్లో కనిపిస్తోన్న లక్షణాలు తీవ్ర కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్‌ను సూచిస్తున్నాయన్నారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.
తన బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అతిశీ మాట్లాడుతూ... కేజ్రీవాల్ అకస్మాత్తుగా బరువు తగ్గడమనేది ఆందోళన కలిగించే అంశమన్నారు. కస్టడీ నుంచి బయటకు వచ్చాక వైద్యుల పరిశీలనలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ తిరిగి బరువు పెరగడం లేదన్నారు.
వైద్య పరీక్షల్లో ఆయన కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అధిక కీటోన్ స్థాయులు, ఆకస్మికంగా బరువు తగ్గడమనేది క్యాన్సర్‌తో పాటు కిడ్నీ సంబంధ వ్యాధులకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పెట్ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు.