Pulivarthi Nani: నాకున్నది ఒకే క్వారీ... రూ.50 కోట్ల జరిమానా వేసి దాన్ని మూయించారు: పులివర్తి నాని
- చెవిరెడ్డిపై తాము ఏ రోజూ వ్యక్తిగత దూషణలు చేయలేదన్న పులివర్తి నాని
- చెవిరెడ్డి ఒక అపరిచితుడు అని వ్యాఖ్యలు
- చెవిరెడ్డి చేసిన దాంట్లో తాము పది శాతం కూడా చెప్పలేదని వెల్లడి
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఇటీవల చెవిరెడ్డి మాట్లాడుతూ, తనపై నాని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలను పులివర్తి నాని ఖండించారు. చెవిరెడ్డిపై తాము ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా సరే తాము ప్రజా సమస్యలపైనే పోరాడామని, చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే మాట్లాడాం తప్ప, ఏనాడూ సొంత విషయాలు మాట్లాడలేదని అన్నారు.
"నా క్వారీ మూయించావు, నా ఫ్యాక్టరీలు మూయించావు... ఏనాడూ నేను పత్రికాముఖంగా మాట్లాడలేదు. చెవిరెడ్డిలాగా నేనేమీ డ్రామాలు ఆడడంలేదు" అని పులివర్తి నాని వ్యాఖ్యానించారు.
తనకు ఉన్నది ఒకే ఒక్క క్వారీ అని, దానికి రూ.50 కోట్ల జరిమానా వేసి మూయించారని, తనను ఆర్ధికంగా దెబ్బతీశారని వివరించారు. నేనేమీ నీలాగా ఎర్రచందనం వ్యాపారం చేయలేదు అంటూ ధ్వజమెత్తారు.
చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో ఎవరూ లేరని, ఆయన ఒక అపరిచితుడు అని వ్యంగ్యం ప్రదర్శించారు. 2014 నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్ల రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు.
2018లో చెవిరెడ్డి తనను దళిత ద్రోహి అన్నాడని, బీసీ ద్రోహి అన్నాడని, కులాల మధ్య చిచ్చుపెడుతున్నానని ఆరోపించాడని వెల్లడించారు. నిన్ను కొట్టారని, నీపై రెక్కీ చేశారని అన్నావు... నువ్వు చేసిన దాంట్లో పది శాతం కూడా మేం చెప్పలేదు... ఇవిగో నువ్వు చేసిన డ్రామాలు అంటూ పులివర్తి నాని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.