Diabetes: చైనా శాస్త్రవేత్తల అద్భుత విజయం.. మూడు నెలల్లోనే డయాబెటిస్ మాయం!

Amazing success of Chinese scientists diabetes disappeared within three months
  • ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మధుమేహ సమస్య
  • చైనాలో అత్యధికమంది బాధితులు
  • సెల్ థెరపీతో అద్భుతం చేసిన చాంగ్‌షెంగ్ ఆసుపత్రి వైద్యుల బృందం
  • 11 వారాల్లోనే పూర్తిగా తగ్గిన ఇన్సులిన్ అవసరం
  • మునుపటిలా పనిచేసిన పాంక్రియాస్
  • సెల్ థెరపీపై బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రశంస
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. చాపకింద నీరులా వ్యాపిస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కారణాలేమైనా కానీ ఒకసారి ఇది వచ్చిందంటే జీవితాంతం దాంతో సావాసం చేయాల్సిందే. పూర్తిగా నయం చేసుకునే మార్గాలు అందుబాటులో లేకపోవడంతో అదుపులో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాల్సిందే. మధుమేహాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు.

సెల్ థెరపీతో మధుమేహం మటాష్
మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ప్రయోగాలు ప్రారంభించిన చైనా శాస్త్రవేత్తలు సెల్ థెరపీ ద్వారా డయాబెటిస్ రోగులను బయటపడేశారు. షాంఘైలోని చాంగ్‌షెంగ్, రెంజీ ఆసుపత్రి వైద్యుల బృందం ఈ సెల్ థెరపీని అభివృద్ధి చేసింది. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రకారం.. జులై 2021లో ఓ డయాబెటిస్ రోగికి సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా 11 వారాల్లోనే వారికి బయటి నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది. ఆ తర్వాత ఏడాది వరకు ఆ రోగి క్రమంగా మందులు తీసుకోవడం తగ్గిస్తూ ఆ తర్వాత పూర్తిగా నోటి ద్వారా మందులు తీసుకోవడం మానేశాడు. 

ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో అతడిలో పాంక్రియాస్ తిరిగి మునుపటిలా పనిచేయడం ప్రారంభించినట్టు అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన  యిన్ తెలిపారు. ప్రస్తుతం ఆ పేషెంట్ 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. డయాబెటిస్ విషయంలో సెల్‌థెరపీ గణనీయమైన పురోగతిని సూచిస్తుందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తిమోతీ కీఫెర్ ప్రశంసించారు. 

అత్యధికమంది బాధితులు చైనాలోనే
ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనాలో అత్యధికమంది మధుమేహ రోగులు ఉన్నారు. ఇది ఆ దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం చైనాలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో 40 మిలియన్ల మంది జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధారపడుతున్నారు.
Diabetes
Cell Therapy
Shanghai Changzheng Hospital
China
Renji Hospital

More Telugu News