Kevin Pietersen: అంబటి రాయుడు ఓ జోకర్: కెవిన్ పీటర్సన్
- ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత రాయుడు చేసిన ఓ పనికి ఆటపట్టించిన మాజీ క్రికెటర్లు
- పోస్ట్ మ్యాచ్ షోలో రాయుడును 'జోకర్' అన్న పీటర్సన్, హేడెన్
- రెండు జట్లకు సపోర్ట్ చేస్తున్నానన్న అంబటి రాయుడు
ఆదివారం చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత అంబటి రాయుడు చేసిన ఓ పనికి జోకర్ అనిపించుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్.. రాయుడిని జోకర్ అంటూ ఆటపట్టించారు.
అసలేం జరిగిందంటే..
ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పై కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాక ముందు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సన్ రైజర్స్‌కు మద్దతు తెలిపాడు. ఆరెంజ్ ఆర్మీకి మద్దతుగా ఆరెంజ్ వెయిస్ట్‌కోట్ ధరించి కనిపించాడు. అయితే, కేకేఆర్ గెలిచిన వెంటనే ఆరెంజ్ కలర్ కోటు తీసేసి, బ్లూ కలర్ కోటు వేసుకున్నాడు. ఇది గమనించిన కామెంటేటర్స్ కెవిన్ పీటర్సన్, మాథ్యూ హేడెన్ అంబటి రాయుడును ఆటపట్టించారు. పోస్ట్ మ్యాచ్ షోలో పీటర్సన్, హేడెన్ ఇద్దరూ రాయుడిని 'జోకర్' అని పిలిచారు.
రెండు జట్లకు సపోర్ట్ చేస్తున్నా: రాయుడు
హోస్ట్ మాయంతి లాంగర్ మాట్లాడుతూ.. "అంబటి రాయుడు ఆరెంజ్ నుంచి బ్లూలోకి మారాడనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు" అని చెప్పారు. పీటర్సన్ తన పర్పుల్ డ్రెస్‌ను చూపిస్తూ.. "నేను కనీసం ఒక్కదానిపై బలంగా ఉన్నాను. నాకు నచ్చింది. నా సొంతమైంది ధరించాను. నువ్వు జోకర్, ఎప్పుడూ జోకర్" అని రాయుడుని ఉద్దేశించి అన్నాడు. ఇందుకు రాయుడు స్పందిస్తూ.. "నేను రెండు జట్లకు మద్దతు తెలుపుతున్నాను. మంచి క్రికెట్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను"అని అన్నాడు.