Mount Everest: మౌంట్ ఎవరెస్ట్ పై ‘ట్రాఫిక్ జాం’.. వీడియో వైరల్
- ఒకే వరుసలో పైకి ఎక్కిన వందలాది మంది పర్వతారోహకులు
- కిందకు దిగే క్రమంలో వీడియో తీసిన రాజన్ ద్వివేదీ
- వీడియోను చూసి అవాక్కవుతున్న నెటిజన్లు
సముద్రమట్టం నుంచి దాదాపు 8.5 కిలోమీటర్ల ఎత్తు! ఎటుచూసినా దట్టంగా పరుచుకున్న మంచు.. ఎముకలు కొరికే చలి.. ప్రచండ వేగంతో వీచే అతిశీతల గాలులు.. ఊపిరి తీసుకొనేందుకు తగినంత ఉండని ఆక్సిజన్.. నిరంతరం పొంచి ఉండే ప్రాణాపాయం. ఇదీ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను చేరుకోవాలంటే పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు. అయితేనేం.. పర్వతారోహకులు వెనక్కి తగ్గట్లేదు. కాస్త అనుకూల వాతావరణం లభించడంతో ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు పోటెత్తుతున్నారు. దీంతో అక్కడ విపరీతమైన ‘ట్రాఫిక్ జాం’ ఏర్పడుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రాజన్ ద్వివేదీ అనే పర్వతారోహకుడు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈ నెల 20న తిరిగి కిందకు దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే జోక్ కాదు. ఇది ఎంతో కష్టతరమైన విషయం’ అని అందులో పేర్కొన్నాడు. తనకు దారిలో కనిపించిన వారిలో 250 నుంచి 300 మంది మాత్రమే ఎవరెస్ట్ ను అధిరోహించగలరని పేర్కొన్నాడు.
1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటివరకు సుమారు 7 వేల మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని వివరించాడు. రద్దీ వల్ల తాను కిందకు దిగడం ఓ పీడకలలా అనిపించిందని, కిందకు దిగే క్రమంలో నీరసించిపోయాయని చెప్పాడు. పర్వతారోహకులంతా తాళ్ల సాయంతో ఎక్కేందుకు ఒకే వరుసలో వస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు ఇన్ స్టాలో సుమారు 30 లక్షల వ్యూస్, 18 వేల లైక్ లు లభించాయి. మరోవైపు ‘ఎక్స్’లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి మరో వీడియోకు ఏకంగా 66 లక్షల వ్యూస్ వచ్చాయి.
అయితే ఈ వీడియోలను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. పర్వతారోహణ స్వార్థపూరితం అయిపోయిందని.. ప్రాణాలు పోయినా, సాయం కోసం అర్థిస్తున్నా ఎవరూ పట్టించుకోరని ఓ యూజర్ మండిపడ్డాడు. శిఖరాన్ని పూర్తిగా చెత్తాచెదారంతో నింపేస్తున్నారని తప్పుబట్టాడు. ప్రపంచం ఇలా తప్పుడు మార్గంలో ఎందుకు వెళ్తోందంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ ఎవరెస్ట్ ఎక్కడం ఇప్పుడు ప్రత్యేకం ఏమీ కాదని అభిప్రాయపడ్డాడు. డబ్బున్న కొందరు వ్యక్తులు తమను తాము మరణానికి అతీతులమని భావిస్తున్నారని మరో నెటిజన్ విమర్శించాడు.
మరోవైపు రాజన్ ద్వివేదీ బృందంతో కలిసి ఎవరెస్ట్ ను అధిరోహించిన డేనియల్ పాటర్ సన్ అనే 39 ఏళ్ల బ్రిటన్ పర్వతారోహకుడితోపాటు నేపాలీ షెర్పా పాస్తెంజీ తిరుగు క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. గత మంగళవారం వారు కిందకు దిగుతుండగా భారీ మంచు వారిపై పడింది. దీంతో వారు ఒక్కసారిగా జారి అగాథంలోకి పడిపోయారు. వారి జాడ తెలియరాలేదని బీబీసీ వార్తాసంస్థ తెలిపింది. కేన్సర్ తో మరణించిన ఓ జిమ్ సభ్యుడి కుటుంబాన్ని ఆదుకొనేందుకు విరాళాల కోసం పాటర్ సన్ ఎవరెస్ట్ ఎక్కాడు.