BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో మోదీ, అమిత్ షా.. బీసీసీఐకి భారీగా న‌కిలీ ద‌ర‌ఖాస్తులు!

Fake India coach applicants use famous names like PM Modi and Amit Shah
  • నిన్న‌టితో ముగిసిన టీమిండియా హెడ్‌కోచ్ ద‌రఖాస్తు గ‌డువు 
  • గడువు ముగిసే సమయానికి 3,400 దరఖాస్తులు వ‌చ్చాయ‌న్న బీసీసీఐ
  • మోదీ, అమిత్‌ షా, సచిన్, షారుఖ్, ధోనీ పేర్లతో భారీగా నకిలీ ద‌ర‌ఖాస్తులు
భార‌త పురుషుల క్రికెట్‌ జ‌ట్టు ప్రధాన కోచ్ పదవి కోసం ఈ నెల భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) నోటిఫికేషన్ విడుదల చేయగా గడువు ముగిసే సమయానికి 3,400 దరఖాస్తులు వ‌చ్చాయ‌ని స‌మాచారం. అయితే, వీటిలో భారీ సంఖ్యలో ప్ర‌ధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, సచిన్ టెండూల్కర్‌, షారుఖ్ ఖాన్, ఎంఎస్‌ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్లతో నకిలీ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు బీసీసీఐ గుర్తించింది. దీంతో ఇప్పుడు వాటిని ఏరివేసే పనిలో క్రికెట్ బోర్డు ఉంది. సోమ‌వారం సాయంత్రంతో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసిన విష‌యం తెలిసిందే. కాగా, బీసీసీఐకి నకిలీ దరఖాస్తులు కొత్తేమీ కాదు గతసారి కూడా ఇలాగే బీసీసీఐకి అనేక నకిలీ దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.

"దరఖాస్తు ప్రక్రియ పబ్లిక్ డొమైన్ ద్వారా జ‌ర‌గ‌డంతో చాలా మంది ద‌ర‌ఖాస్తు ఫారమ్‌ను సులభంగా యాక్సెస్ చేయగలరు. ప్ర‌స్తుతం ఇది బీసీసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఇక‌పై ఈ విధానం ద్వారా మేము దరఖాస్తులను ఆహ్వానించడానికి బ‌దులు కొత్త ప్రక్రియల‌తో ముందుకు వ‌స్తాం. ఇది నకిలీ దరఖాస్తులను పూర్తిగా నివారిస్తుంది అని బోర్డు వ‌ర్గాలు ఇండియాటుడే.ఇన్‌కి వెల్ల‌డించాయి.

కోచ్ రేసులో గౌతం గంభీరే ఫేవరెట్‌
భారత జట్టు ప్రధాన కోచ్ కావడానికి ఫేవరెట్‌లలో కేకేఆర్‌ మెంటార్ గౌతం గంభీర్ ఒకడని తెలుస్తోంది. ఈసారి కోల్‌క‌తా ఐపీఎల్‌ టైటిల్ గెల‌వ‌డంతో గౌతీ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. త‌న‌దైన మెంట‌ర్‌షిప్‌తో జ‌ట్టుకు తోడుగా ఉండి ముందుకు న‌డిపించాడు. దీంతో కేకేఆర్ టోర్నీ ఆద్యంతం అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. చివ‌రికి ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే గంభీర్‌పై బీసీసీఐ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్లు స‌మాచారం. 

అంత‌కుముందు భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్‌ ప‌ద‌వి కోసం ఇద్దరు మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్లు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వారు ప్రధాన కోచ్‌గా ఉండటానికి ఆసక్తి చూప‌లేద‌ని కూడా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే, తాము ఏ ఆస్ట్రేలియ‌న్ మాజీ క్రికెట‌ర్ల‌ను కోచ్ ప‌ద‌వి కోసం సంప్ర‌దించ‌లేద‌ని బీసీసీఐ సెక్రట‌రీ జైషా స్పష్టం చేశారు.

కాగా, ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరి నాటికి ముగుస్తుంది. కొత్త కోచ్‌ పదవీకాలం జులై 1 నుంచి మొదలై 2027 డిసెంబరు 31 వరకు ఉంటుంది. 2027లో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను టీమిండియా కొత్త కోచ్ ఆధ్వ‌ర్యంలోనే ఆడ‌నుంది. అయితే ఈ కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ దిగ్గజాల పేర్లు వినిపించగా మరోసారి ఇండియన్ ప్లేయరే ఉంటాడా? లేక విదేశీ కోచ్‌వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందో తెలియాల్సి ఉంది.
BCCI
Team India
Head Coach
Cricket
Sports News
PM Modi
Amit Shah
Sachin Tendulkar
MS Dhoni

More Telugu News