Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్, తెలంగాణ రాష్ట్ర గీతం స్వరకల్పనపై స్పందించిన రేవంత్ రెడ్డి
- తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదన్న ముఖ్యమంత్రి
- తమ హయాంలో జరిగిన ట్యాపింగ్‌పై బీఆర్ఎస్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
- అధికారం మారిన తర్వాత జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయన్న సీఎం
- ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని వెల్లడి
- రాష్ట్ర గీతానికి స్వరకల్పన బాధ్యతను అందెశ్రీకి అప్పగించామన్న ముఖ్యమంత్రి
తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నింటికి సీబీఐ విచారణను అడిగే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వారి హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ విచారణలో తన ప్రమేయం లేదని వెల్లడించారు.
అధికారం మారిన తర్వాత జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయన్నారు. అందుకు ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందన్నారు. జాతి వ్యతిరేక శక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చునని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన బాధ్యతను అందెశ్రీకి అప్పగించినట్లు చెప్పారు. ఎవరితో సంగీతం సమకూర్చుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. అందుకే రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుందన్నారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా ఈ చిహ్నం ఉంటుందన్నారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని... ఎలాంటి సమస్యలు లేవన్నారు. విద్యుత్ వినియోగం పెరిగినా లోటు లేకుండా ఇస్తున్నట్లు చెప్పారు.