Pan Card: మే 31 లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోండి: ఆదాయపన్ను శాఖ
- పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్న కేంద్రం
- ఇప్పటికే అనేక పర్యాయాలు గడువు పొడిగింపు
- ఈసారి గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని కేంద్రం
- ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ నిరుపయోగంగా మారుతుందని వెల్లడి
పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తోంది. ఇప్పటికే పలుసార్లు ముగింపు గడువు పొడిగించింది. ఈ నేపథ్యంలో, పాన్ కార్డు-ఆధార్ లింక్ చేయడంపై ఆదాయపన్ను శాఖ మరోసారి స్పందించింది.
మే 31వ తేదీ లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలని స్పష్టం చేసింది. లేకపోతే పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని హెచ్చరించింది. నిర్ణీత గడువులోగా పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం చేయకపోతే భారీగా అధికరేటుతో టాక్స్ డిడక్షన్ లు ఎదుర్కొనాల్సి ఉంటుందని వివరించింది.
టీడీఎస్-టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్టుగా కొందరు పన్ను చెల్లింపుదారులకు నోటీసులు రావడానికి కారణం... వారు పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోవడమేనని ఆదాయ పన్ను శాఖ వివరించింది. వారి పాన్ కార్డు నిరుపయోగంగా మారడంతో, రిటర్న్స్ లో పేర్కొన్న పాన్ నెంబరు చెల్లుబాటు కాలేదని వెల్లడించింది.
అందుకే మే 31 లోపు పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకుని అదనపు భారం తగ్గించుకోవాలని సూచించింది.