Rafael-M: మరో 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో భారత్ చర్చలు
- ఇప్పటికే భారత్ వద్ద 36 రాఫెల్ యుద్ధ విమానాలు
- తాజాగా రూ.50 వేల కోట్లతో డీల్ కుదిరే అవకాశం
- కొత్తగా కొనుగోలు చేసే రాఫెల్ విమానాలు నేవీకి అప్పగించనున్న కేంద్రం
- ఈ నెల 30న ఢిల్లీలో భారత్-ఫ్రాన్స్ చర్చలు
త్వరలోనే మరి కొన్ని రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ అమ్ముల పొదిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 26 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్... ఫ్రాన్స్ తో చర్చలు జరపనుంది. స్వదేశీ విమాన వాహకనౌక విక్రాంత్ పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదించింది.
ఈ నేపథ్యంలో, భారత్-ఫ్రాన్స్ మధ్య మే 30న కీలక చర్చలు జరగనున్నాయి. ఈ ఒప్పందం విలువ రూ.50 వేల కోట్లు. తాజాగా కొనుగోలు చేసే రాఫెల్ యుద్ధ విమానాలను భారత నేవీకి అప్పగించనున్నారు.
ఈ నెల 30న ఫ్రాన్స్ ఉన్నతస్థాయి ప్రభుత్వ బృందం ఢిల్లీకి రానుంది. ఫ్రాన్స్ బృందంతో చర్చల్లో రక్షణ శాఖ, నావికా దళ అధికారులు పాల్గొంటారు. ఇప్పటికే భారత్ వద్ద 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిని భారత వాయుసేన నిర్వహిస్తోంది.
ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారీదారుగా ఉంది. ఈ సంస్థ రాఫెల్ లో మెరైన్ వెర్షన్ ను అభివృద్ధి చేసింది. వీటిని రాఫెల్ మెరైన్ లేదా రాఫెల్ ఎం అని పిలుస్తారు. వీటిని సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా రూపొందించారు. ఇప్పుడీ రాఫెల్ ఎం యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకే భారత్ ఆసక్తి చూపిస్తోంది.
రాఫెల్ ఎం... సింగిల్ సీటర్ విమానం. ఈ విమానాలతో గగనతల రక్షణ, అణుదాడులను ఎదుర్కొనడం, శత్రు గగనతలాల్లోకి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం, సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.
రాఫెల్ ఎం గంటకు 1,389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గగనతలంలో గరిష్ఠంగా 50 వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిస్సైళ్లు, ఎంఐసీఏ క్షిపణులు, హ్యామర్, స్కాల్ప్, ఏఎం39, ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చగల శతఘ్ని పొందుపరిచారు.