Indian Soldiers: టగ్ ఆఫ్ వార్.. చైనా సైనికులను చిత్తుగా ఓడించిన భారత ఆర్మీ.. వీడియో ఇదిగో!
- సూడాన్ లో బలగాల మధ్య టగ్ ఆఫ్ వార్
- యూఎన్ మిషన్ లో భాగంగా సూడాన్ లో భారత బలగాలు
- శాంతి ఒప్పందంలో భాగంగా నియమించిన ఐరాస
చైనా బలగాలను మన సైనికులు చిత్తుగా ఓడించారు. కదనరంగంలోనే కాదు క్రీడా రంగంలోనూ భారత్ ఓటమిని ఒప్పుకోదని చాటిచెప్పారు. ఈమేరకు సూడాన్ లో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి (యూఎన్) తరఫున వెళ్లిన భారత సైనిక బలగాలకు, అక్కడున్న చైనా సైనికులకు తాజాగా టగ్ ఆఫ్ వార్ పోటీ జరిగింది. సరదాగా సాగిన ఈ ఆటలో మన సైనికులు సత్తా చాటారు. చైనా సైనికులను ఓడించి సంతోషంతో డ్యాన్స్ చేశారు. ఈ ఆటకు సంబంధించిన వీడియోను ఆర్మీ ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండియా వర్సెస్ చైనా అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.
సూడాన్ లో శాంతి ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి బలగాలను మోహరించింది. యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్ (యూఎన్ఎంఐఎస్) పేరుతో ఏర్పాటు చేసిన మిషన్ లో భారత్ తో పాటు చైనా బలగాలు కూడా ఉన్నాయి. శాంతి స్థాపనకు కృషి చేయడంతో పాటు మానవతా సాయం, భద్రత, మానవ హక్కుల ప్రమోషన్ తదితర లక్ష్యాలతో ఈ మిషన్ ను ఐరాస ఏర్పాటు చేసింది.