Crocodile: రెయిలింగ్ పైనుంచి దూకేందుకు భారీ మొసలి ప్రయత్నం.. వీడియో ఇదిగో
- యూపీలోని బులంద్ షహర్ పట్టణంలో కాసేపు కలకలం సృష్టించిన మొసలి
- గంగానది కాలువలోంచి బయటకు దూసుకురావడంతో భయపడ్డ స్థానికులు
- చివరకు దాన్ని బంధించి మరో కాలువలో విడిచిపెట్టిన అటవీ సిబ్బంది
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ పట్టణంలో ఓ 10 అడుగుల భారీ మొసలి కాసేపు కలకలం సృష్టించింది. నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చిన మొసలి అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆహారం కోసం కాలువలోంచి భారీ మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయపడిపోయారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది. ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్ ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది.
దీంతో అటవీ అధికారులు ఆ మొసలిని బందించేందుకు ముందుగా దాని కళ్లపై ఓ బట్ట కప్పారు. ఆ తర్వాత దాని మూతి, తలకు తాడు బిగించి కొందరు సిబ్బంది పట్టుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు దాని తోకను గట్టిగా పట్టుకోగా ఇంకో వ్యక్తి మొసలి వెనక కాళ్లకు తాడు కట్టాడు. చివరకు కొన్ని గంటల కసరత్తు అనంతరం మొసలిని అక్కడి నుంచి తరలించి పీఎల్ జీసీ అనే మరో కాలువలోకి విడిచిపెట్టారు. నీటిలోంచి బయటకు వచ్చిన దాన్ని ఆడ మొసలిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మోహిత్ చౌదరి తెలిపారు.