Thotapalli Madhu: జయసుధగారికి వేయి క్షమాపణలు: రచయిత తోటపల్లి మధు
- గత ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసిన మధు
- అసహనాన్ని వ్యక్తం చేసిన అభిమానులు
- సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి అసంతృప్తి
- అందరికీ క్షమాపణలు చెప్పిన రచయిత
రచయిత తోటపల్లి మధు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. తన సమాకాలీకుల గురించి ఆయన రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాసరి .. మురళీమోహన్ .. జయసుధ .. కోడి రామకృష్ణ .. ఇలా చాలామంది గురించి ఆయన మాట్లాడిన మాటలు, వాళ్ల అభిమానుల అసహనానికి కారణమైంది. అందుకు క్షమాపణ చెబుతూ ఆయన మరోసారి కెమెరా ముందుకు వచ్చారు.
" మా ఇంట్లో ఒక్కొక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. కానీ అందరూ కలిసి అభిమానించే హీరోయిన్ జయసుధ గారు. ఆమె నటించిన ఆరు సినిమాలకు నేను పనిచేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను జయసుధ గారికి వీరాభిమానిని మాత్రమే కాదు .. ఆమెకి భక్తుడిని. ఈ వేదిక ద్వారా ఆమెకి నేను వెయ్యిసార్లు క్షమాపణలు చెబుతున్నాను" అని అన్నారు.
"ఇక కోడి రామకృష్ణగారు నా గురువుగారు .. నా స్క్రీన్ నేమ్ ఇంటిపేరుతో కలిపి పెట్టుకోమని చెప్పిందే ఆయన. ఆయనతో 20 సినిమాలకు కలిసి పనిచేశాను. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు, మేటర్ పక్కకి వెళ్లడం వలన ఆ టాపిక్ మధ్యలో ఆగిపోయింది. దాంతో అంతా అపార్థం చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు బాధపడ్డారు .. వాళ్లను క్షమించమని అడుగుతున్నాను" అని అన్నారు.