Chandrababu: టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
- కౌంటింగ్ రోజు ప్లాన్‌పై నేతలతో చర్చించిన టీడీపీ అధినేత
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ మాటల యుద్ధం
- ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ నేతలు, కార్యకర్తలకు బాబు సూచన
- కౌంటింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాలని నేతల్ని కోరిన చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చిన చంద్రబాబు.. బుధవారం పార్టీలోని కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కౌంటింగ్ డే ప్లాన్‌పై నేతలతో ఆయన చర్చించడం జరిగింది.
ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అధికార వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలు, కార్యకర్తలకు సూచించారు. కౌంటింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాలని నేతల్ని చంద్రబాబు కోరారు. ఇందుకోసం శుక్రవారం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజక వర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు.
అలాగే జూన్ 1న జోనల్ స్ధాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ రెండు కార్యక్రమాలు చాలా కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేగాక పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు, అంచనాల నేపథ్యంలో కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధనలపై ఇప్పటికే వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని నేతల్ని చంద్రబాబు ఆదేశించారు.
వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ఈసీ, పోలీసులపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. అటు కౌంటింగ్ రోజు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ, డీజీపీకి లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు గానూ, 130 ఎన్నికల పరిశీలకులనే నియమించడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నుంచి ఉండవల్లి ఇంట్లోనే ఉంటూ కౌంటింగ్ ప్లాన్‌ను టీడీపీ అధినేత పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.