Andhra Pradesh: ఏపీలో పెన్షన్ సొమ్ము విడుదల... జూన్ 1న పెన్షనర్ల ఖాతాల్లో జమ
- 63.30 లక్షలకు పైగా పెన్షనర్లకు రూ.1,939 కోట్లు విడుదల
- 47.74 లక్షల మంది ఖాతాల్లో జమ
- మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి పంపిణీ
- ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల సొమ్ము విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 65.30 లక్షలకు పైగా పెన్షనర్లకు రూ.1,939.35 కోట్లు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఈ మొత్తాన్ని జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47.74 లక్షల మంది ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జత చేస్తామని వెల్లడించారు. మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్య ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు.
ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ల నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం, మే నెలలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈసారి బ్యాంకు ఖాతాల్లోనే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.