Chittoor District: 10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35 మార్కులు.. రీకౌంటింగ్ లో 89!
- చిత్తూరు జిల్లాలో ఘటన
- పదో తరగతి హిందీ పరీక్షలో విద్యార్థికి 35 మార్కులు
- మిగతా పరీక్షల్లో 90పైగా మార్కులు
- పునఃమూల్యాంకనంలో 89 మార్కులు రావడంతో అంతా షాక్
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందీలో 35 మార్కులు సాధించిన ఓ విద్యార్థికి పునఃమూల్యాంకనంలో ఏకంగా 89 రావడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాకు చెందిన ఉర్జిత్ అనే విద్యార్థికి తెలుగులో 95, ఇంగ్లిష్లో 98, సైన్స్ లో 90, సోషల్ లో 85, హిందీలో 35 మార్కులు వచ్చాయి.
హిందీలో మరీ తక్కువ మార్కులు రావడంతో షాకైన విద్యార్థి తల్లిదండ్రులు ఆ సబ్జెక్టుకు పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థికి జవాబు పత్రం, మార్కుల వివరాలు పోస్టులో వచ్చాయి. హిందీలో విద్యార్థికి 89 మార్కులు వచ్చినట్టు తేలడంతో విద్యార్థి, అతడి తల్లిదండ్రులు కంగుతిన్నారు. ప్రతి విద్యార్థికి ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ఇలాగేనా చేసేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.