Madras High court: కోమాలో ఉన్న భర్త ఆస్తి అమ్మేందుకు భార్యకు మద్రాస్ హైకోర్టు అనుమతి

Madras High court allows woman to sell property of husband who is in coma
  • భర్త కోమాలో ఉండడంతో, అతడి ఆస్తి అమ్మే హక్కు కోరుతూ మహిళ పిటిషన్
  • మహిళ అభ్యర్థనను తోసిపుచ్చిన సింగిల్ జడ్జి బెంచ్
  • చట్టంలో ఇందుకు అవకాశం లేదని న్యాయమూర్తి స్పష్టీకరణ, తీర్పుపై మహిళ అప్పీలు
  • చట్టంలో లేకపోయినా మహిళను సంరక్షకురాలిగా నియమిస్తూ కోర్టు ఉత్తర్వులు
  • కేరళ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా తీర్పు
భర్త కోమాలో ఉంటే అతడి ఆస్తి అమ్మేందుకు భార్యకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన భర్త ఆస్తులకు తనను గార్డియన్‌గా నియమించాలంటూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. శశికళ అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత సింగిల్ జడ్జ్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. చట్టంలో  ఇందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. సివిల్ కోర్టును ఆశ్రయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ తీర్పుపై శశికళ చేసుకున్న అప్పీలుపై జస్టిస్ స్వామినాథన్, జస్టిస్ బాలాజీల ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టంలో ఏ వెసులుబాటు లేకపోయినా మహిళ సంరక్షకురాలు అనేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. భర్త ఆస్తుల నిర్వహణకు భార్యకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. శశికళను తన భర్త శివకుమార్‌కు గార్డియన్‌గా నియమించి, రూ.కోటి విలువైన ఆస్తిని విక్రయించేందుకు అనుమతించింది. ఇందులో రూ.50 లక్షలు శివకుమార్‌పై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీ వినియోగించుకోవచ్చని పేర్కొంది.
Madras High court
Husband Property
Guardian

More Telugu News