T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్: భారత్ మ్యాచ్లను ఎప్పుడు, ఎక్కడ చూడాలి; సమయం, వేదికలు, షెడ్యూల్
- జూన్ 2 నుంచి 29 వరకు టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్
- సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న అమెరికా, వెస్టిండీస్ దేశాలు
- టోర్నీ తొలి మ్యాచ్ లో అమెరికా, కెనడా ఢీ
- జూన్ 5న ఐర్లాండ్ తో మొదటి మ్యాచ్ ఆడనున్న టీమిండియా
- భారత్ లో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ లో లైవ్
పురుషుల 9వ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ జూన్ 2న అమెరికా గడ్డపై ప్రారంభం కానుంది. డలాస్ లోని గ్రాండ్ ప్రయరీ స్టేడియంలో జరగనున్న ఇనాగరేషన్ మ్యాచ్ లో ఆతిథ్య అమెరికా, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ వరల్డ్ కప్ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలు 2007 నుంచి నిర్వహిస్తుండగా, మొట్టమొదటి టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఈసారి వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది.
అమెరికాలోని 3 వేదికలు, వెస్టిండీస్ లోని 6 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మొత్తం 9 వేదికల్లో 55 మ్యాచ్ లు జరగనున్నాయి. జూన్ 26న ట్రినిడాడ్ లో తొలి సెమీఫైనల్, జూన్ 27న గయానాలో రెండో సెమీఫైనల్... ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ లో జరగనున్నాయి.
ఈసారి వరల్డ్ కప్ లో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 20 జట్లలో 10 జట్లు వరల్డ్ కప్ టోర్నీలో తమ తొలి మ్యాచ్ లను అమెరికా గడ్డపై ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లకు లాడర్ హిల్, డాలస్, న్యూయార్క్ నగరాల్లోని స్టేడియంలు వేదికగా నిలవనున్నాయి.
ఇక, అన్నిటికంటే ముఖ్యమైన అంశం... టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్! దాయాదులు వరల్డ్ కప్ లో తలపడుతున్నారంటే ఆ కిక్కే వేరు! వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. జూన్ 9న ఈ రసవత్తర సమరం జరగనుంది. భారత్, పాక్ మ్యాచ్ కు లాంగ్ ఐలాండ్ లోని నాసావ్ కౌంటీ స్టేడియం వేదికగా నిలవనుంది.
కాగా, ఈసారి టోర్నీలో మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు ఉంటాయి. ఒక్కో గ్రూపు నుంచి మెరుగైన ప్రతిభ చూపి టాప్-2లో నిలిచిన రెండు జట్లు సూపర్-8 దశకు అర్హత పొందుతాయి. సూపర్-8 దశలో పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి.
జట్లు-గ్రూప్ లు...
గ్రూప్-ఏ: టీమిండియా, పాకిస్థాన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా
గ్రూప్-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్
గ్రూప్-సి: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా
గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
కాగా, లీగ్ దశలో టీమిండియా ఆడే మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.
భారత్ లో ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీని స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇంగ్లీషుతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ వంటి ప్రాంతీయ భాషల్లోనూ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అందించనుంది. ఇక, డిస్నీ హాట్ స్టార్ లో వరల్డ్ కప్ ను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు.