UP: తన ఫోన్ లాక్కున్నాడన్న కోపంతో భర్తను కరెంట్ షాక్ తో హింసించిన భార్య!
- ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురీలో ఘటన
- నిత్యం మొబైల్లో గడుపుతున్న భార్య ఫోన్ తీసుకున్న భర్త
- దీంతో కోపం పెంచుకున్న ఆమె.. భర్తకు చిత్రహింసలు
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురీలో అమానవీయ ఘటన జరిగింది. నిత్యం మొబైల్లో గడుపుతున్న భార్య ఫోన్‌ను భర్త తీసుకున్నాడు. దీంతో కోపం పెంచుకున్న ఆమె.. భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. మొదట భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ షాక్ ఇస్తూ కొడుతూ రాక్షసత్వం ప్రదర్శించింది. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన 14 ఏళ్ల కుమారుడిపైన కూడా చేయి చేసుకుంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు ప్రదీప్‌సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం అతడు సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. కాగా, 2007లో ఔరయ్యకు చెందిన దివాన్ సింగ్ కుమార్తె బేబీ యాదవ్‌తో ప్రదీప్‌సింగ్‌కు వివాహమైంది.
బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. "నా భార్య తన మొబైల్ ఫోన్లో ప్రతిరోజూ ఎవరితోనో మాట్లాడేది. ఈ విషయమై నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. అలాగే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాను. వారి సూచన మేరకు నేను ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకున్నాను. ఇది ఆమెకు కోపం తెప్పించింది. ఫోన్ ఇచ్చేయాలని మొదట ఆమె నన్ను బెదిరించింది. ఈ క్రమంలో నన్ను, నా కొడుకును చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. ఆపై ఆమె నన్ను క్రికెట్ బ్యాట్‌తో పదే పదే కొట్టడం చేసింది. నా కొడుకు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె నాకు కరెంట్ షాక్ ఇచ్చింది. నన్ను రక్షించడానికి యత్నించిన కుమారుడిపై కూడా దాడి చేసింది" అని ప్రదీప్‌సింగ్ తెలిపాడు.
కిష్ని పోలీస్ స్టేషన్ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. భర్తపై వేధింపులకు పాల్పడిన బేబీ యాదవ్‌పై ఐపీసీ సెక్షన్లు 307 (హత్యకు ప్రయత్నించడం), 328 (నేరం చేయాలనే ఉద్దేశ్యంతో విషం ద్వారా గాయపరచడం మొదలైనవి), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.