Daggubati Purandeswari: మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు తెచ్చారు: పురందేశ్వరి
- రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన బీజేపీ బృందం
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్ కు వినతి
- గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ... గవర్నర్ కు 13 అంశాలతో వినతిపత్రం అందించినట్టు వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకం కింద వచ్చిన నిధులను దారిమళ్లించారని అన్నారు. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్ లకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు.
ఆఖరికి, మద్యం అమ్మకాలపై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారని పురందేశ్వరి ఆరోపించారు. కార్పొరేషన్ల వారీగా చేసిన అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని వెల్లడించారు.