Monsoon: ఎండలతో అల్లాడుతున్న వేళ.. వాతావరణశాఖ చల్లటి కబురు
- గురువారమే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
- ఈసారి నిర్ణీత సమయానికి ముందుగానే వర్షాలు
- ఇప్పటికే పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు
ఎండలతో దేశం ఉడికిపోతున్న వేళ వాతావరణశాఖ మరో చల్లని కబురుచెప్పింది. గురువారమే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అనుకున్న తేదీ కంటే ముందుగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లోకి కూడా ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడడంతో వాటి గమనాన్ని ఇది బలంగా లాగిందని, అందుకనే అనుకున్న సమయానికి ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటాయని వాతావరణశాఖ పేర్కొంది.