VV Lakshminarayana: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగింపుపై లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
- రాజకీయ పార్టీలు ఏవీ స్పందించలేదన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు
- గడువు అనంతరం కూడా కొనసాగింపుపై ఎవరూ మాట్లాడలేదని విమర్శ
- ఎగ్జిట్ పోల్స్‌లో మునిగిపోయారని లక్ష్మీ నారాయణ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ విభజన హామీ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు కొనసాగింది. ఆ గడువు నేటితో (జూన్ 2) ముగిసిపోయింది. అయితే ఈ గడువును మరింతకాలం పొడిగించాలంటూ ఏపీ నుంచి పెద్దగా డిమాండ్లు వినిపించడం లేదు. ఈ పరిణామంపై ‘జై భారత్ నేషనల్ పార్టీ’ వ్యవస్థాపకుడు ఆసక్తికరంగా స్పందించారు. ఊహించినట్లుగానే జరిగిందని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల తర్వాత కూడా కొనసాగించాలనే అంశంపై రాజకీయ పార్టీలు ఏవీ స్పందించలేదని విమర్శించారు. అందరూ ఎగ్జిట్ పోల్స్‌లో మునిగిపోయి ఉన్నారని తెలుస్తోందని, ఇక ఆ దేవుడే ఏపీని ఆదుకోవాలని లక్ష్మీ నారాయణ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కాగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రం ఏర్పాటు అయ్యి నేటితో 10 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను 10 ఏళ్లపాటు కొనసాగింపునకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాజధానిగా ఏపీ పరిపాలన సాగించేందుకు వీలుండేది. అయితే పరిపాలనా సౌలభ్యం రీత్యా ఏపీ నుంచి పరిపాలనకు ప్రభుత్వాలు మొగ్గుచూపిన విషయం తెలిసిందే.