Kangana Ranaut: ఎంపీ కంగనా రనౌత్.. స్పష్టం చేసిన ఎగ్జిట్ పోల్స్
- లోక్ సభలో అడుగుపెట్టనున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
- రాజకీయ అరంగేట్రంలో నటి సక్సెస్
- హిమాచల్ లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ లోక్ సభలో అడుగుపెట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన కంగనా.. అరంగేట్రంలోనే అదరగొట్టారని, మండిలో విజయం అందుకోబోతున్నారని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్ పై కంగనాదే పైచేయని అంచనా వేశాయి. చాలాకాలంపాటు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మండి నియోజకవర్గం 2014 జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ వైపు మొగ్గింది. ఆ ఎన్నికల్లో మండి ఓటర్లు బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మకు జైకొట్టారు.
హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రతిభా సింగ్ పై 39 వేల మెజారిటీతో రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రామ్ స్వరూప్ శర్మ మరోమారు గెలుపొందారు. అయితే, 2021లో శర్మ మరణించడంతో ఉప ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ప్రతిభా సింగ్ ను నిలబెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో మండి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య టఫ్ ఫైట్ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంగనా రనౌత్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.