Pune Porsche crash: ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’.. పూణె యాక్సిడెంట్ పై బాలుడి జవాబు

Pune teen admits he was drunk when accident happened

  • ఆ రోజు రాత్రి ఏం జరిగిందని బాలుడిని ఆరా తీసిన పోలీసులు
  • మద్యం సేవించినట్లు అంగీకరించిన బాలుడు
  • మత్తులో ఉండడంతో ఏంజరిగిందనేది గుర్తులేదని వెల్లడి

అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ అంటూ విలన్ ను విసిగించడం గుర్తుందా.. సరిగ్గా ఇప్పుడు ఇదే డైలాగ్ ను పూణె బాలుడు పోలీసులకు వినిపించాడు. మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన బాలుడు ప్రస్తుతం జువెనైల్ బోర్డు పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో కారు ప్రమాదంపై ఆరా తీయడానికి పోలీసులు ఆ బాలుడిని తాజాగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి పలు ప్రశ్నలు సంధించారు. కారు ఎంత వేగంతో నడిపావు.. యాక్సిడెంట్ ఎలా జరిగింది.. ఆ తర్వాత ఏం చేశారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో మద్యం సేవించి కారు నడిపినట్లు బాలుడు అంగీకరించాడు. అయితే, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని, ఏం జరిగిందనేది ఏమీ గుర్తులేదని వివరించాడని అధికార వర్గాలు తెలిపాయి. 

మే 19న తెల్లవారుజామున పూణెలో కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాకా పీకలదాకా మద్యం సేవించిన బాలుడు.. ఆపై ఖరీదైన కారుతో ఇంటికి బయలుదేరాడు. పోర్షె కారును వేగంగా నడుపుతూ ఓ టూవీలర్ ను ఢీ కొట్టాడు. గంటకు 200 కిలోమీటర్ల స్పీడుతో దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో టూవీలర్ పై వెళుతున్న ఇద్దరు టెకీలు ఎగిరి దూరంగా పడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదానికి కారణమైన బాలుడిని తప్పించేందుకు తండ్రి తాతలు రంగంలోకి దిగి, బాలుడి రక్త నమూనాలను మార్చేశారు. కొడుకు రక్త నమూనాల స్థానంలో తల్లి రక్తాన్ని పరీక్షలకు పంపించారు. డబ్బుతో డాక్టర్లను కొనేసిన తండ్రి.. డ్రైవర్ ను ప్రలోభపెట్టిన తాత.. రక్త పరీక్షల కోసం తన రక్తం ఇచ్చిన తల్లి.. ఇలా అందరూ జైలు పాలయ్యారు. డబ్బు తీసుకుని తప్పుడు రిపోర్టు ఇచ్చిన వైద్యులు కూడా కటకటాలు లెక్కపెడుతున్నారు.

  • Loading...

More Telugu News