Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకరరెడ్డి రాజీనామా
- తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన లేఖ
- గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు
- ఇప్పుడు వైసీపీ అనూహ్య ఓటమితో రాజీనామా
- అటు తిరుపతిలో భూమాన కుమారుడు అభినయ్ రెడ్డి పరాజయం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి భూమన కరుణాకరరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన లేఖ రాశారు. కాగా, గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతోనే భూమన రాజీనామా చేసినట్లు సమాచారం.
ఇక కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో తన కుమారుడు ఓడిపోయిన తర్వాత భూమన కరుణాకర రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి తన వారసుడు అభినయ్ రెడ్డిని బరిలోకి దింపారు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేశారు కానీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓడిపోయారు. కుమారుడి విజయం కోసం భూమన చాలానే కష్టపడ్డారు. కాగా, ఈసారి టీడీపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి రాజకీయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2004-2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్గా పని చేశారు. 2006 నుంచి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా విధులు నిర్వర్తించారు. మళ్లీ 2023 ఆగస్టులో ఆ పదవిని చేపట్టారు. ఇప్పుడు ఓటమి భారంతో పదవికి రాజీనామా చేశారు.