Pawan Kalyan: వైఎస్ జగన్ నాకు వ్యక్తిగత శత్రువు కాదు.. భవిష్యత్తులో వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు: పవన్ కల్యాణ్
- ఫలితాల తర్వాత తొలిసారి జనసేన చీఫ్ ప్రెస్మీట్
- ఇది చారిత్రాత్మకమైన రోజు అన్న జనసేనాని
- ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తానన్న పవన్
- ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వ్యాఖ్య
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చామో అది కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. ముఖ్యంగా ఓ జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేయడానికి కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత శత్రువు కాదన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదని తెలిపారు. వైసీపీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కూటమికి ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు మంచి చేయడానికి కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని చెప్పారు.
ఇక 2019లో ఓడిపోయినప్పుడు తన మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు గెలిచాక కూడా అలాగే ఉందన్నారు. ఆంధ్ర ప్రజలు తనకు పరువు ఇచ్చారు, ఇంత గెలుపు ఇచ్చారు, ఆకాశమంత ఉత్సాహం ఇచ్చారని జనసేనాని తెలిపారు. ఇప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. వారి కష్టాలలో పాలుపంచుకుంటానని అన్నారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా తనను గుర్తు పెట్టుకోవాలన్నారు.
మీ కుటుంబంలో ఒకడు అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడని అనుకోవాలంటూ పవన్ తెలిపారు. ప్రభుత్వం ఎలా ఉండాలి.. అధికార యంత్రాంగం ఎలా పని చేయాలి అనే విషయాలను రాబోయే రోజుల్లో చేసి చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 చోట్ల విజయం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అటు ఎంపీగా బరిలోకి నిలిచిన రెండు చోట్ల కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది.